Renikuntla Praveen
Political activist · Bellampalli · M.A. Sociology
This biography is based on details supplied by Praveen’s team. Linked news reports independently document selected public roles and library work.
1991–2001: ఉద్యమ నేపథ్యం
విద్యార్థి దశలో ఆర్ఎస్యూ (RSU) ఉద్యమంతో నా ప్రస్థానం ప్రారంభమైంది. 1991లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో పూర్తికాల కార్యకర్తగా చేరాను. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సింగరేణి కార్మిక సమాఖ్య (సి.కా.స.) ఆధ్వర్యంలో కోల్బెల్ట్ ప్రాంతంలో కార్మికుల సమస్యలపై పనిచేశాను.
ఈ కాలంలో కార్మికుల హక్కుల సాధన కోసం వారిని సంఘటితం చేసి, వివిధ పోరాటాల్లో భాగస్వాములను చేశాను. కార్మిక సమస్యలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమాలు నిర్వహించాను.
2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి డీజీపీ హెచ్.జె. దొర గారి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశాను.
2001–2026: రాజకీయ ప్రస్థానం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షతో, 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి నాయకత్వంలో స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరాను. ఆయన నాయకత్వంలో సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామినయ్యాను.
కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, బెల్లంపల్లి నియోజకవర్గంతోపాటు జిల్లా స్థాయిలో పార్టీ విస్తరణకు, సంస్థాగత బలోపేతానికి కృషి చేశాను. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, ప్రజలతో మమేకమై నా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను.
తెలంగాణ ఉద్యమంలో పోరాట స్ఫూర్తి
2002లో కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడానికి కృషి చేశాను. 2009లో కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు అనేక ఉద్యమ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను.
ఈ క్రమంలో రైలు రోకో తదితర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు నాపై సుమారు 18 కేసులు నమోదయ్యాయి. జైలు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నాను. ఈ నిర్బంధాల మధ్య సైతం తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి కట్టుబడి, ఉద్యమంలో నిబద్ధతతో పనిచేశాను.
పార్టీ, కార్మిక సంఘంలో నిర్వహించిన బాధ్యతలు
పార్టీ సంస్థాగత బలోపేతం, కార్మికుల హక్కుల సాధన లక్ష్యంగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించాను.
- 2003లో: మంచిర్యాల తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శిగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను.
- 2007లో: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాను.
- 2008–2013 మధ్య: బెల్లంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేశాను.
- 2013–2016 మధ్య: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించాను.
పార్టీ అప్పగించిన ఎన్నికల బాధ్యతలు
పార్టీ ఆదేశాల మేరకు పలు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు, ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తించాను.
- 2004లో: సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.
- 2006లో: కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారి తరఫున మెట్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాను.
- 2010లో: సిర్పూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో దహెగాం మండల ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాను.
- 2012లో: పరకాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఊకల్ హవేలీ ప్రాంత ఎన్నికల ఇన్చార్జిగా పనిచేశాను.
- 2015లో: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.
- 2015లో: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూకట్పల్లి డివిజన్లో ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వర్తించాను.
- 2016లో: వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నాను.
- 2020లో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోరబండ డివిజన్ ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాను.
- 2021లో: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించాను.
- 2021లో: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వర్తించాను.
ప్రభుత్వ బాధ్యతలు
2017లో మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి, 2023 వరకు ఆ పదవిలో కొనసాగాను. అనంతరం, 2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ పదవికి నా పదవీకాలం 2026 అక్టోబర్ వరకు ఉంది.
గ్రంథాలయాల అభివృద్ధి
మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం, జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చాను. విద్యార్థులు, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలు, ఆధునిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశాను.
గ్రంథాలయాల్లో ఆధునిక సౌకర్యాలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత గ్రంథాలయాన్ని పునరుద్ధరించి, ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన ఫర్నిచర్, ఎయిర్ కండిషనింగ్ వసతి కల్పించాను. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాను.
బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో అన్ని హంగులతో కూడిన పక్కా గ్రంథాలయ భవనాన్ని నిర్మించి, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం, ఆధునిక ఫర్నిచర్, పోటీ పరీక్షల పుస్తకాలను సమకూర్చాను. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోనూ ఆధునిక గ్రంథాలయ భవనంతోపాటు అవసరమైన ఫర్నిచర్, పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చాను.
మండల కేంద్రాల్లో గ్రంథాలయాల విస్తరణ
మారుమూల ప్రాంతాల ప్రజలు, విద్యార్థులకు గ్రంథాలయ సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో వేమనపల్లి, కోటపల్లి, భీమారం, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయాలను నిర్మించాను. జన్నారం, దండేపల్లి మండలాల్లో నూతన గ్రంథాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించాను.
అలాగే, మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.18 కోట్ల వ్యయంతో అత్యాధునిక గ్రంథాలయ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశాను
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణతోపాటు ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను. ఈ సదుపాయాలను వినియోగించుకున్న అభ్యర్థుల్లో సుమారు 366 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నిర్వర్తించిన బాధ్యతలు
2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి కృషి చేశాను.
ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన అట్రాసిటీ కేసుల విచారణలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాను. జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణకు కృషి చేసి, సంబంధిత అధికారులతో కేసుల పురోగతిని సమీక్షించాను. బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, సహాయ సహకారాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాను.
ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాను. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను సందర్శించి, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేశాను.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు నిబంధనల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేశాను. పౌర హక్కుల దినోత్సవం వంటి కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేశాను.
కమిషన్కు కల్పించిన అధికారాల పరిధిలో బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయానికి, సమగ్ర అభివృద్ధికి తోడ్పడ్డాను.